Sunday, November 6, 2016

10 నవంబర్ 2016 విజయవాడలో మహాశాంతి యాగము

2015 జూలై  14 గురుగ్రహము సింహరాశిలోకి ప్రవేశించటంతో గోదావరి  పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సింహరాశిలోకి  ప్రవేశించిన గురువు శాస్త్ర రీత్యా దోషప్రదుడు. ఇది ఇలా ఉండగా 2016 జనవరి 29న ఈ సింహరాశిలోనికే రాహువు ప్రవేశించటంతో గురువు మరింత దోషప్రదుడయ్యాడు. సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ సూర్యునికి ఈ సంవత్సరం గురు నక్షత్రమైన పూర్వాభాద్రలో  సంపూర్ణ గ్రహణం జరిగింది. అలాగే సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి సింహరాశిలోనే సూర్యునకు మరో  సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. అంతేకాక శత్రు గ్రహాలైన శని, కుజులు ఇక కాలంలో వక్రం కావటం, ఆగష్టు 24న శని, కుజులు కలవటం జరిగింది.

ఈ రెండు గ్రహణాల మధ్య కాలంలో అనగా జూన్ 24న గురువు, రాహువు ఒకే బిందువులోకి రావటంతో నాగబంధనం ఏర్పడింది. ఈ నాగబంధనమే మరింత దోష ప్రదమైనది. దీని ప్రభావం వలన ముందు మూడు మాసాలు, తదుపరి ఆరు మాసాలు వెరసి 9 మాసాల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం భారతదేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దు దేశాల మధ్య యుద్ధభయ వాతావరణం నెలకొనటం,  రాష్ట్రాల నడుమ కలహప్రద సూచనలు ఉండును. అంతేకాక తరచూ భూకంపాలు, వైమానిక ప్రమాదాలు, జల సంబంధిత ప్రకృతి ఉండటమే కాక, రాష్ట్రాలను పాలించే నాయకులపైనా కూడా దాని ప్రభావం ఉండునని 2016 మార్చి 1న విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ బంధన దోష నివృత్తికై 2016 మార్చి 6 హైద్రాబాద్లోనూ, ఏప్రిల్ 3 విశాఖపట్నంలోనూ, మే 1 ఒంగోలులోను , మే 29 రాజమండ్రిలోను, జూన్ 24 సికింద్రాబాద్లోను, జులై 1 తిరుపతిలోను, జులై 31 గుంటూర్లోనూ విశేష రీతులలో సప్త సూర్య మహాయాగాలు జరిగినవి.

2016 నవంబర్ 7 మధ్యాహ్నం 11 గంటల 58 నిముషాల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల 31 నిముషం వరకు గ్రహ మాలికా యోగము జరుగుచున్నది. ఈ యోగం జరుగనున్న రోజులలోని గురువారం నాడు పరిహారంగా మహా శాంతి యాగం జరగనున్నది. అందుచే సప్త యాగాలలో సేకరించిన భస్మాలను సప్త నదుల నీటితో తడిపి, సప్త కలశాలకు నింపి , ఈ సప్త కలశాలను 2016 నవంబర్ 10 గురువారము గురునక్షత్రమైన పూర్వాభాద్రలో, ప్రజలందరి చేత విశేష రీతిలో నదీ జలంతో, శాంతి మంత్రాలతో అభిషిక్తం కావించబడును. ఇదే మహాశాంతి యాగము.

రుద్ర స్తోత్రంలో చెప్పబడిన శివుని యొక్క అష్టమూర్తిత్వములలో శర్వుడు భూమికి, భవుడు జలానికి, రుద్రుడు అగ్నికి, ఉగ్రుడు వాయువునకు, భీముడు ఆకాశమునకు ఆధిపత్యములు వహించగా మనలోని జీవునకు పశుపతి, సూర్య చంద్రులకు ఈశుడు, మహాదేవుడు ఆధిపత్యం వహిస్తున్నారు. కనుక ఈ కార్తీక మాసంలో శివుని యొక్క అష్టమూర్తిత్వాలలో రెండవ దైన  జలంతో మహాశాంతి యాగం  జరుపబడును.


ఈ మహాశాంతి యాగము విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజ్ కి ప్రక్కన గల ఉండవల్లి కరకట్ట పైన గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ వారి పీఠంలో 10 నవంబర్ 2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.


కార్యక్రమం తదుపరి సప్త కలశాలలోని తడిసిన భస్మములన్నింటిని ప్రత్యేక పద్దతిలో కలిపి, డిసెంబర్ మొదటి వారంలో భక్తులకు  అందజేయబడును.  ముఖ్యంగా 2016 నవంబర్ 14 కార్తీక పూర్ణిమ సోమవారం నాడు మహతి యోగ సమయంలో సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయిలో పున్నమి చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండి, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో కార్తీక పూర్ణిమని మహతి యోగం అంటారు. ఈ మహతీ యోగం అనగా దేవతలు అనుగ్రహించుటకు అనువైన సమయమని అర్థము. ఈ యోగము దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రభావం ఉండును . ఈ సమయము పూర్తిగా స్త్రీ దేవత మూర్తులను ఆరాధించుటకు విశేష అనుకూల సమయముగా భావించాలి. అయితే ఈ యోగం ప్రభావంచేతను, మరో వైపునున్న వ్యతిరేక గ్రహస్థితులు వలనను  భూకంప సూచనలు మరియు సముద్రాలపై దాని ప్రభావం అధికంగా ఉండును. ఇందుచేతనే దీపావళి అమావాస్య నాడే ఇటలీలో భూకంపం తీవ్రస్థాయిలో రావటం జరిగింది. కనుక దీని ప్రభావం నవంబర్ 28వరకు ఉన్నది. కాబట్టి సముద్ర తీరాలలో స్నానాలు ఆచరించేవారు పై రోజులలో జాగ్రత్తలు తీసుకొనవలసినది.

మహతి యోగం ఒకవైపు వ్యతిరేక ప్రభావాన్ని ఇస్తూనే, మరోవైపు పూర్తి అనుకూల స్థితులను కూడా అందించును. అందుచేతనే జాతకులపై నాగబంధన దోష ప్రభావము తగ్గటానికి, మహతీ యోగ అనుకూల ప్రభావము పొందటానికి గాను, నా ఆధ్వర్యంలో పై సూర్య యాగాలు చేసి, నవంబర్ 10న మహాశాంతి యాగానికి సిద్ధం కాబోతున్నాము . ఈ యాగానికి వచ్ఛే వారు తమతో పాటు ఒక చిన్న పాత్రను కూడా తీసుకొని వచ్చేది. (ఎందుకంటే కృష్ణా నదిలో పారుతున్న నీటిని తీసుకొని కలశాలపై పోయుటకు, పాత్ర ఏ లోహంతో చేసినది అయిననూ పర్వాలేదు. ) 27 నక్షత్రములు మరియు నవగ్రహ మూలమంత్రములతో పాటు సంపుటీకరణ విధి విధానంతో జరిగే శాంతి సంబంధ వేద మంత్రోచ్చారణల మధ్య, ఎవరికీ వారు తమంతట తామే సప్త కలశాలపై నదీ జలాన్ని అభిషిక్తం చేసుకునే అవకాశం ఉన్నది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొనవలసినది.- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.