Friday, August 28, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని

మూల నక్షత్రం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆశ్వీజ మాసంలోని సరస్వతీ పూజ.
మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాఢా సుపూజనం|
ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్|| అను ధర్మసిందు గ్రంధానుసారం మూలా నక్షత్రంలో సరస్వతి దేవిని ఆవాహన చేసి పూర్వాషాడ నక్షత్రంలో విశిష్ట పూజలు గావించి శ్రవణా నక్షత్రంలో సరస్వతీ దేవిని విసర్జించాలి అని అర్థం.

అయితే శ్రవణా నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉండే మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్ర సహోదరే శ్రీ మహాలక్ష్మి దేవి. ఈ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అనగా రెండవ శుక్రవారం ఆచరిస్తారు.

వాస్తవానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మూల నక్షత్రం రోజే ఆచరించాలని పురాతన తాళపత్ర గ్రంధాలు పేర్కొన్నప్పటికీ... మూల నక్షత్రం వచ్చిన రోజున కొన్ని సార్లు శుక్రవారం వస్తుంటుంది. మరికొన్ని సార్లు ఇతర వారాలు వస్తుంటాయి. శ్రావణ మంగళ గౌరికి శ్రావణ మంగళవారాలు ప్రీతికరం కాగా... శ్రావణలక్ష్మి దేవికి శుక్రవారాలు పూజా కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. అందుచేత వారానికే ప్రాధాన్యత ఇచ్చి, పూర్ణిమ లోపల వచ్చే రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా కేటాయిస్తారు.

రెండవ శుక్రవారం కాకుండా మూడవ శుక్రవారం కానీ, 1వ శుక్రవారం కాని, 4వ శుక్రవారం కాని, వరలక్ష్మి వ్రతం శాస్త్రీయంగా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన కూడా కొంతమందికి రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే దక్షిణాయనం లోని ఆరు మాసాలలో మూల నక్షత్రం పూర్ణిమకు ముందుగా వస్తుంటుంది. ఉత్తరాయనంలోని ఆరు మాసాలలో మూల నక్షత్రం పూర్ణిమ తదుపరి వస్తుంటుంది. ఉత్తరాయణాన్ని శక్తి (స్త్రీ దేవతా) సంబంధిత పూజాదులకు, దక్షిణాయనాన్ని శివ (పురుష దేవత) సంబంధ పూజాదులకు యోగ్యతగా ఉంటాయి.

ఇక రెండవ శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతానికి ఎందుకు తీసుకుంటున్నామంటే.... మూల నక్షత్రం రెండవ శుక్రవారం గాని... లేదా అటు ఇటు వస్తుందే తప్ప మిగిలిన మూడు శుక్రవారాలలో రానే రాదు. అందుచేతనే మూల నక్షత్ర వర వర్షిని వరలక్ష్మి తల్లిని... కేవలం శ్రావణ మాసంలోనే కాక ఇతర మాసాలలో వచ్చే మూల నక్షత్ర సుదినాలలో కూడా ఏయే నైవేద్యాలతో ఆరాధిస్తే, లక్ష్మి సహోదరుడైన చంద్ర స్థితి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడునో.... పరోక్షంగా షట్చక్ర తత్వాలు, షట్చక్ర దేవతల నామాలు వారి నివేదనలు... శ్రీ లలిత సహస్రనామాలలో 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు అరవై నామాలలో 25 లైన్లలో 7 నివేదనలతో స్పష్టం చేయబడినవి.

కనుక శ్రీ మహాలక్ష్మి దేవి సహోదరుడైన చంద్రుడు... మనకు మామ, అదే చందమామ స్థితిగతులను బట్టే మానవాళి ప్రవర్తనా సరళి, ఆరోగ్య స్థితిగతులు, ఆర్ధిక బలాబలాలు, అంతరంగ రహస్యాలు మొదలైన ఎన్నో ఎన్నెన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఈ పరంపరలో అందరికీ ముఖ్యంగా కావాల్సింది ధనమూలం ఇదం జగత్. కనుక చంద్ర సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం సంపాదించాలి. అనేక రకాలైన లక్ష్మి అనుగ్రహ మార్గాలు ఉన్నప్పటికీ, లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పిన సప్త చక్ర దేవతలకు సప్త నివేదనలు ఇస్తూ.... ఆహారంతోనే చందమామను వశ పర్చుకొని ఆపైన చంద్ర సహోదరి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.

చంద్రమాసమైన శ్రావణ పూర్ణిమ రోజే సోదరి సోదరునకు కట్టిన రక్షా బంధనంతో... సోదరి సోదరుల విడదీయరాని బంధం దిన దిన ప్రవర్ధమానమవుతూ... సూర్య మాసంగా ఉన్న కార్తిక (పూర్ణిమ సూర్య నక్షత్రమైన కృత్తిక కనుక) మాసంలో ఇదే సోదరి చేతితో చేసిన వంటతోనే సోదరుడు ప్రీతిగా భోజనం చేసే భగినీహస్తభోజనం గురించి మనకు తెలుసు. ఏతా వాత చెప్పొచ్చేది ఏమిటంటే మహాలక్ష్మి దేవి అనుగ్రహం కావాలంటే ప్రప్రధమంగా సోదరుడైన చంద్రుడి స్థితి బాగుండాలి. ఈ చంద్ర స్థితి మెరుగు కావాలంటే మూల నక్షత్రంలో తల్లికి నివేదించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

ఇట్టి మూల నక్షత్ర నైవేద్యాలు కథా, కమామీషు అంశాలకు సంబంధించిన ప్రవచనాన్ని 2015 ఆగష్టు 25 మంగళవారం మూల నక్షత్రం రోజున హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయానికి చేరువలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామీ సన్నిధిలో నాచే రెండుగంటల పాటు శ్రావణ లక్ష్మి వైభవం- మూల నక్షత్రంలో వర వర్షిని అనే శీర్షికన జరిగిన కార్యక్రమ వీడియో నాల్గు భాగాలలో ఉన్నది. కనుక తప్పక వీడియో ను దర్శించి మీ సన్నిహితులకు సమాచారం అందించగలరని మనః స్పూర్తిగా ఆశిస్తున్నాను. - శ్రీనివాస గార్గేయ 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.