Monday, July 20, 2009

గ్రహణం రోజున దైవ దర్శనమా ?


ఖగోళంలో గ్రహణాలు జరిగినప్పుడు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయాలలో అర్చనలు లేకుండా ద్వారాలను మూసివుంచి, దర్శనాలను నిలిపి వేయుట ఆనవాయితీ. ఎందుకు ఇలా ఆలయాలను మూసివుంచాలి?



ఎందుకంటే.... జగద్రక్షకులైన సూర్యచంద్రులకు, గ్రహణములు సంభవించునపుడు యావత్ జాతి సూతకులగుదురు.

ఇట్టి సమయంలో ఆలయాలలో దైవ దర్శనాలను నిలిపి వేసి గర్భాలయములను మూసివుంచుట భారతీయ ధర్మశాస్త్ర శాసనము. దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా శ్రీ కాళహస్తి పట్టణం పంచభూత లింగాలలో వాయు లింగేశ్వరుడు గా వెలసిన దివ్య క్షేత్రమూ మరియు దక్షిణ కాశీగా పేరొందిన పవిత్ర పుణ్యదేవాలయంలో, సూర్య చంద్ర గ్రహణములు సంభవించే రోజులలో, గర్భాలయమును మూయక, భక్తులను దైవ దర్శనానికి అనుమతిస్తున్నారు.


దాదాపు ౩ వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సంపూర్ణ గ్రహణము తిరిగి ఈ శతాబ్దపు (01.08.2008) పంచమ సంపూర్ణ సూర్య గ్రహణము గా, పంచగ్రహ కూటమితో, పంచకాల సర్పయోగాలకు నాందిపలికిన అశుభ సమయాన, ఎన్నో శతాబ్దాల క్రితం ఆదిశంకరులు ప్రతిష్ట చేసిన స్ఫటిక లింగం శ్రీ కాళహస్తి లో బీటలు వారటం, రెండు ప్రధాన శక్తి ఆలయాలలో(2008) వందల కొద్ది దుర్మరణం జరగటం పాఠకులకు తెలిసినదే.


సూర్యచంద్ర గ్రహణాల రోజున దైవ దర్శనాలను నిలపాలని, గర్భాలయాన్ని మూసివుంచాలని శాసించే ధర్మశాస్త్ర గ్రంధాలు ఎన్నో వున్నాయి కానీ గ్రహణాలలో శ్రీ కాళహస్తి గర్భాలయాన్ని మూయకూడదని, భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పే వివరం, ఏ ధర్మశాస్త్ర గ్రంధంలో, లేక ఏ శైవాగమ గ్రంధంలో వున్నదో ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత శ్రీ కాళహస్తి దేవస్థాన పాలకమండలికి, పండితులకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు వుంది. కేవలం ఆలయ అర్చకులు చూపే ఏవో చిన్నిపాటి కారణాలు కాక, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ముక్కంటికి మచ్చ లేకుండా చేయాల్సిన అవసరం వుంది.


ఈ విరోధిలో ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే 2009 జూలై 22 సంపూర్ణ సూర్య గ్రహణము, 15 జనవరి 2010 అతిపెద్ద కంకణ సూర్య గ్రహణము సంభవించనున్నది. ఉత్తరాయనము ప్రారంభమైన రెండవ రోజే కుంభమేళ పవిత్ర స్నాన సందర్భములో ఈ గ్రహణము ఓ ప్రపంచారిష్టం. ప్రజలు భయపడవలదని మా మనవి.


కనుక ఆయా రోజులలో శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని తెరవకుండా వుంచి, భక్తులకు దర్శనాలను ఆపవలెనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులకు వినయముగా తెలియజేయుచున్నాను. లేదా ఆలయాన్ని తెరవవచ్చు అని చెప్పే సరియైన సక్రమమైన అసలుసిసలైన ప్రామాణిక గ్రంధాన్ని చూపెట్ట వలసిన భాద్యత వున్నదని గుర్తుచేస్తున్నాను. ప్రజల క్షేమంకోరే ఈ వార్త వ్రాయటం జరిగింది. అంతేకాని ఆలయ పండితుల మీద అక్కసుకాదని గ్రహించేది. మీడియా ప్రభంజనం ఉన్న నేటి రోజులలో జనవిజ్ఞానవేదిక నుంచి వచ్చే సూటి ప్రశ్నలకు మనం కూడా ఖచ్చిత ప్రమాణాలను చూపించాల్సిన అవసరం వుంది. - శ్రీనివాస గార్గేయ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.