Tuesday, January 3, 2012

ముక్కోటి ధర్మశాస్త్ర నిర్ణయము

ధనుర్మాసం ప్రారంభమైన తరువాత వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిధిని ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యమానం ప్రకారం ధనుస్సంక్రమణం, చాంద్రమానం ప్రకారం ఏకాదశి తిధి నిర్ణయంతో సూర్య చంద్ర మానములను అనుసరించి ముక్కోటి ఏకాదశి నిర్ధారణ జరుగును. అందుచే ఒక్కోసారి పుష్యమాసం రావచ్చు లేదా మార్గశిర మాసం రావచ్చు. ఈ 2012 లో జనవరి నాల్గవ తేదీయా, అయిదవ తేదీయా అనే సందేహం కలుగును. కనుక సందేహ నివృత్తికై క్రింది వివరాలను తెలియచేస్తున్నాను.

మా కాలచక్రం, గ్రహభూమి మరియు శ్రీచక్ర పంచాంగములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య వున్న విజయవాడ పట్టణమునకు సంస్కారయుతమై గణితము చేయబడినది. విజయవాడకు జనవరి నాల్గవ తేదీన సూర్యోదయము 6 . 37 నిమిషాలు. భారత ప్రభుత్వ ఆమోదిత గణితమైన దృగ్గణిత ప్రకారం నాల్గవ తేదీ సూర్యోదయమునకు ముందు 6 గం. 12 ని. లనుంచి ఏకాదశి తిధి ప్రారంభమైనది. నాల్గవ తేదీ బుధవారం రోజున ఏకాదశి తిధి పూర్తిగా వుండి, 5 తేదీ ఉదయం 8 గం. 35 ని. ల వరకు వున్నది.


రాష్ట్రం లో వున్న భారత ప్రభుత్వ ఆమోదం లేని ఇతర పూర్వ గణిత పంచాంగాలలో 4 వ తేదీ ఉదయం 5 గం. 34 ని. లకు ఏకాదశి ప్రారంభమై 5 వ తేదీ ఉదయం 7 గం. 49 ని. వరకు ఏకాదశి తిధి ఉంది.


సహజంగా అందరూ ఊహించేది ఏమిటంటే ఏకాదశి తిధి 4 వ తేదీన పూర్తిగా వున్నదని, 5 వ తేదీన సూర్యోదయం తరువాత కొన్ని గంటలే వుందని, అందుచే 4 నే ముక్కోటి పర్వదినమని అనుకుంటారు కానీ అలా కానే కాదు.


ముక్కోటి పండుగ నిర్ణయంలో అరుణోదయంలో ఏకాదశి తిధి వుండాలి. మరి అరుణోదయమనగా, సూర్యోదయమునకు ముందున్న సమయాన్ని అరుణోదయం అంటారు. ఇట్టి అరుణోదయంలో 4 ఘడియలపాటు ఏకాదశి తిధి వుండి తీరాలి. ఘడియ అనగా 24 నిమిషాలు. 4 ఘడియలనగా 96 నిమిషాలు. అనగా ఒక గంటా 36 నిమిషాలు అన్నమాట.


పై నిర్ణయం ప్రకారం 4 వ తేదీ సూర్యోదయానికి ముందున్న అరుణోదయ సమయంలో 4 ఘడియలపాటు ఏకాదశి తిధి లేనే లేదు. కనుక 4 న పర్వదినం కాదు. 5 వ తేదీ సూర్యోదయానికి ముందున్న అరుణోదయ సమయంలో 4 ఘడియలల కంటే కూడా పూర్తిగా ఏకాదశి తిధి ఉంది. అందుచే 2012 జనవరి 5 వ తేదీ గురువారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినం శాస్త్ర నిర్దేశం. 4 ఘడియల కాలంలో ఏకాదశి తిధి పూర్తిగా లేక కొంత వుంటే.. ధర్మశాస్త్ర నిర్ణయానుసారం ఏకాదశి తిధికి అరుణోదయంలో దశమి వేధ కలిగినదని భావము. ఇట్టి వేధ నిషిద్ధము.


గతంలో 1949 విరోధి నామ సంవత్సర పుష్యమాసంలో డిశంబరు 30 శుక్రవారం సూర్యోదయానికి కొన్ని నిమిషాలు ముందుగా ఏకాదశి తిధి ప్రారంభమై, 30 న పూర్తిగా ఏకాదశి తిధి ఉండి, 31 శనివారం ఉదయం 8 గం. 13 ని. లతో ఏకాదశి తిధి ముగిసినది. 1949 లో దృగ్గణిత ప్రకారం మాత్రం 30 శుక్రవారం సూర్యోదయం తదుపరి తిధి ప్రారంభమై 31 తో ముగిసినది. ఆనాటి పండితులందరూ ముక్కోటి పర్వదినాన్ని 31 శనివారం
నాడే నిర్ణయించారు. పాత పంచాంగములు ఉన్నటువంటివారు, ఈ వివరములను చూసి తెలుసుకోవచ్చు.

స్వస్తిశ్రీ ఖర నామ సంవత్సర పుష్య శుక్ల ఏకాదశి గురువారం 2012 జనవరి 5 న ముక్కోటి ఏకాదశి పర్వదినంగా మా పంచాంగం నిర్ణయించటం జరిగింది. మా నిర్ణయములకు ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంధమైన నిర్ణయసింధు పేర్కొన్న విశేష అంశాలను దిగువ ఉదహరిస్తున్నాను.


తదాహ
మాధవః -
అరుణోదయవేదోత్రవేధః సూర్యోదయే తధా
ఉక్తౌ ద్వౌదశమీ వేధౌ వైష్ణవస్మార్తయోః క్రమాత్ ||
తా|| ఏకాదశి వ్రత విషయంలో అరుణోదయ వేధ మరియు సూర్యోదయ వేధ రెండూనూ వైష్ణవులకు స్మార్తులకు చెప్పబడినదని మాధవుడు చెప్పినట్టు " నిర్ణయసింధు " గ్రంధం పేర్కొంది.

అరుణోదయ
స్వరూపంచ మాధవీయేస్కాందే
ఉదయాత్ర్పాక్ చతస్రస్తుఘటికా అరుణోదయః
తా || మాధవీయంలోని స్కాంద వచనాన్ని అనుసరించి సూర్యోదయానికి ముందు 4 ఘడియలు అరుణోదయమని " నిర్ణయసింధు " పేర్కొంది.

ఉదయాత్ర్పాక్
యదా విపర ముహూర్తద్వయ సంయుతా
సంపూర్ణైకాదశి నామ తత్రైవోపవసేత్ గృహీ
తా|| సూర్యోదయ పూర్వము 2 ముహూర్తముల కాలం ( ముహుర్తమనగా 48 నిమిషములు లేక 2 ఘడియలు ) ఏకాదశి తిధి వుంటే, అప్పుడే సంపూర్ణ ఏకాదశిగా భావించాలని గరుడ పురాణమందలి సౌరధర్మ వచనంగా ధర్మశాస్త్ర గ్రంధమైనటువంటి " నిర్ణయసింధు " పేర్కొంది.

దశమీ
శేష సంయుక్తో యదిస్యాదరుణోదయః నైవోపోష్యం వైష్ణవేన
తిద్ధినైకాదశి వ్రతం - ఇతి గారుడే || భవిష్యేచ యోగామాత్రేనిషేదాత్
తా|| గరుడ, భవిష్య పురాణాలలో కూడా అరుణోదయ సమయంలో దశమి తిధి శేషం వుంటే ఏకాదశి వ్రతం లేదని ఆ యోగం నిషేధం అని తెలిపినట్టుగా " నిర్ణయసింధు " గ్రంధం పేర్కొన్నది.

సర్వప్రకార
వేదోయ ముపవాసస్య దూషకః ఇతి నిగమేపి
తా|| వేధ ఏ ప్రకారానికి చెందినది అయిననూ ఉపవాస వ్రతానికి దోషాన్ని కలిగించునని నిగమములలో కూడా చెప్పినట్లుగా " నిర్ణయసింధు " తెలిపినది.

యచ్ఛభవిష్యే
-
ఆదిత్యోదయ వేలాయః ప్రాఙ్ ముహూర్తద్వాయాన్వితా,
ఏకాదశీతు సంపూర్ణ విద్దాన్య పరికీర్తితా ||
తా|| సూర్యోదయం కంటే రెండు ముహూర్తాల కాలంలోని ఏకాదశి సంపూర్ణ ఏకాదశి అని మిగిలినది విద్ధని భవిష్య పురాణ వచనంగా " నిర్ణయసింధు " పేర్కొంది.
వ్రతరూపస్తూ
ఇతి బ్రహ్మవైవర్తే -
ప్రాప్తే హరిదినే సమ్యక్ విధాయ, నియమంనిశి
దశమ్యాముపవాసస్య ప్రకుర్యాత్ వైష్ణవం వ్రతం ||
తా|| దశమి రాత్రి ఉపవాస నియమాన్ని గ్రహించి ఏకాదశి వ్రతాన్ని యదావిధిగా ఆచరించాలని బ్రహ్మవైవర్త పురాణాంశంగా "నిర్ణయసింధు " పేర్కొంది.

ఇదంచ
, శివభక్తాది భిరపికార్యం వైష్ణవో వాథ శైవోవాసారో ప్యేత
త్సమాచారేత్, ఇతి సౌరపురాణశ్చ.
తా|| ఈ వ్రతాన్ని శైవులు, గాణాపత్యులు కూడా చేయాలి. వైష్ణవుడైనా, శైవుడైనా, సౌరుడైనా దీనిని ఆచరించాలని సౌరాపురాణంలో చెప్పబడినట్లుగా ధర్మశాస్త్ర గ్రంధమైన "నిర్ణయసింధు " స్పష్టం చేసింది.

కనుక 2012 జనవరి 5 నే ముక్కోటి ఏకాదశి.

- శ్రీనివాస గార్గేయ