అక్షయ తదియ రాగానే బంగారం కొనుగోలు చేయటం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీ అయింది. అక్షయ తదియ రోజున బంగారం కొంటే, సంవత్సరం అంతా బంగారం ఎక్కువగా కొంటారనే ఉద్దేశ్యంతో వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలతో చాటటం మనకి తెలిసిన విషయమే. ఆనాడు బంగారం కొని, తదుపరి రోజులలో అప్పుల పాలై, కొన్న బంగారంతో పాటు అంతకుముందున్న బంగారాన్ని కూడా అమ్మివేసిన వారు ఎంతో మంది వున్నారు. అక్షయ తదియ నాడు బంగారం కొనుగోలు చేయాలని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేనేలేవు. ఇది ఒక సెంటిమెంటల్ గోల్డ్ ఫెస్టివల్. కానీ ఇందుకు భిన్నంగా నేను చెప్పబోతున్న మరొక అంశం ఏమిటంటే.....
2010 అక్టోబర్ 29 శుక్రవారం రోజున బంగారము, పట్టు, సిల్క్ ఇతర వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు, సౌందర్యాలంకరణ సామగ్రి, టెలివిజన్, సెల్ ఫోన్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణములను కొనుగోలు చేయకండి. ఆరోజు కొనుగోలు చేయాలనుకున్నవారు ముందు రోజైన 28 గురువారం లేక తరువాత రోజు 30 శనివారం గానీ కొనుగోలు చేయండి. 29 శుక్రవారం మాత్రం వద్దు.
అక్షయ తదియ నాడు కొనుగోలు చేయమని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేవు కదా ! మరి 29 కొనుగోలు వద్దని చెప్పే కారణాలు ఏమిటని అనుకోవచ్చు. ఆశ్వీజ పూర్ణిమ నుంచి అమావాశ్య వరకు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులపై షడ్గ్రహ, సప్తగ్రహ ఆచ్చాదనలుండి, శుక్రుడికి మౌద్యమి సంభవించిన తదుపరి వచ్చే మొదటి శుక్రవారం నాడే ఓ గ్రహస్థితి వుంది. అదేమంటే అసలే వక్ర శుక్రుడు. దానికి తోడు మౌద్యమి. పైగా రాహు నక్షత్రమైన స్వాతిలో ఒకే బిందువులో నీచ రవితో శుక్ర కలయిక, కించిత్ వైరమున్న వక్ర గురువు యొక్క దిన నక్షత్రం పునర్వషు... ఇన్నింటి కారణంగా శుక్ర గ్రహ సంబంధమైనవి కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేస్తే సమస్యలు రాగల అవకాశాలు చాలా వున్నవి. కనుక జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం వున్నవారు దయచేసి కొనుగోలు చేయకండి. బంగారం ధర తగ్గితే కొందామని కూడా అనుకోకండి.